Exploring the Mystical World of Manidweepa Varnana Telugu – మణిద్వీప వర్ణన
మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్ర రూపిణీ
మన మనసులలో కొలువైయుంది (1)
సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణ పూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణిద్వీపానికి మహానిధులు (2)
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్-సంపదలు
లక్షల లక్షల లక్ష్మి పతులు
మణిద్వీపానికి మహానిధులు (3)
పారిజాత వన సౌగంధాలు
సురాధి నాథుల సత్సంగాలు
గంధర్వాదుల గాన స్వరాలు
మణిద్వీపానికి మహానిధులు (4)
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము
పద్మరాగములు సువర్ణ మణులు
పది ఆమడల పొడవున గలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు (5)
అరువది నాలుగు కళామ-తల్లులు
వరాల నొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు (6)
అష్టసిద్ధులు నవ నవ నిధులు
అష్టదిక్కులు దిక్పాలకులు
సృష్టి కర్తలు సుర లోకాలు
మణిద్వీపానికి మహానిధులు (7)
కోటి సూర్యుల ప్రచండ కాంతులు
కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిధులు (8)
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము
కంచు గోడల ప్రాకారాలు
రాగి గోడల చతురస్రాలు
ఎడామడల రత్నరాశులు
మణిద్వీపానికి మహానిధులు (9)
పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయ ప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు (10)
ఇంద్రనీల మణి ఆభరణాలు
వజ్రపు కోటలు వైడూర్యాలు
పుష్యరాగ మణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు (11)
సప్తకోటిఘన మంత్ర విద్యలు
సర్వ శుభప్రద ఇచ్చా శక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞాన శక్తులు
మణిద్వీపానికి మహానిధులు (12)
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము
మిలమిలలాడే ముత్యపు రాశులు
తళతళలాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు (13)
కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాల నొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు (14)
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచ-భూతములు పంచ శక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు (15)
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహా గ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు (16)
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము
మంత్రిణి దండిని శక్తి సేనలు
కాళి కరాళీ సేనాపతులు
ముప్పదిరెండు మహా శక్తులు
మణిద్వీపానికి మహానిధులు (17)
సువర్ణ రజిత సుందర గిరులు
అనంగదేవి పరిచారికలు
గోమేధిక-మణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు (18)
సప్త సముద్రములు అనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు
నానా జగముల నదీ నదములు
మణిద్వీపానికి మహానిధులు (19)
మానవ మాధవ దేవగణములు
కామధేనువులు కల్పతరువులు
సృష్టి స్థితి లయ కరణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు (20)
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము
కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదముల ఉపనిషత్తులు
పదారురేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు (21)
దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు (22)
శ్రీవిఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞాన ముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు (23)
పంచభూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు
సంతాన-వృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు (24)
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము
చింతామణులు నవరత్నాలు
నూరామడల వజ్రపు రాశులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు (25)
దుఃఖము తెలియని దేవీసేనలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకలు పురుషార్ధలు
మణిద్వీపానికి మహానిధులు (26)
పదునాలుగు లోకాలన్నిటి పైన
సర్వ లోకమను లోకము కలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం (27)
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల మంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో (28)
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము
మణిగణఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరిదాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో (29)
పరదేవతను నిత్యము కొలచి
మనసర్పించి అర్చించినచో
అపార ధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది (30)
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిది సార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదల తులతూగేరు (31)
శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివిన చోట
తిష్టవేసుకుని కూర్చొనునంట
కోటి శుభాలను సమకూర్చుటకై (32)
భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము
Sri Vishnu Sahasranama Stotram in Telugu – శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం
- Sri Lalitha Ashtottara Shatanamavali in Telugu – శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః - April 11, 2024
- Sri Durga Kavacham in Telugu – శ్రీ దుర్గా దేవి కవచం - April 10, 2024
- Shivananda Lahari in Telugu – శివానందలహరీ - April 9, 2024